
'' యోజనానాం సహస్రాణి శనైర్గచ్చేత్ పిపీలకం , అగచ్చన్ వైనతేయో పదమేకం నగచ్ఛతి ''...
యోజనం దూరమైనా..నెమ్మదిగా, నెమ్మదిగా వెళ్ళినా..చీమ కూడా అధిగమించ గలుగుతుంది..వెళ్ళడం అంటూ
మొదలుపెట్టి, కొనసాగిస్తే! వెళ్ళకుండా, వున్న చోటనే వుంటే గరుత్మంతుడు కూడా వున్న చోటనే ఉంటాడు..అంగుళం
కూడా ముందుకు సాగడు!వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పటికీ వెళ్ళాలనే కోరిక లేకుంటే ఎక్కడికీ వెళ్ళలేడు ఎవడూ!వెళ్ళే
శక్తి లేకున్నా వెళ్ళాలనే కోరిక వుంటే ఎంతో కొంత ముందుకు , ఎవరినో ఒకరిని సాయంగా తీసుకుని ఐనా,
ఎప్పటికో ఒకప్పటికి వెళ్ళవచ్చు!కనుక శక్తి కన్న సంకల్ప శక్తి ఇంకా శక్తి వంతమైనది! దాన్నే మనోబలం అన్నారు
భారతీయులు!ఆ మనోబలం శారీరక బలం కన్నా వందలరెట్లు గొప్పది! మనోబలం వున్న మనిషి నిత్య చైతన్య రస
ప్రవాహమే! ఆది లేని వాడు జీవచ్ఛవమే!అందుకే,బలమే జీవనం,బలహీనతయే మృత్యువు.. Strength is Life,
Weakness is Death..అన్నారు స్వామి వివేకానంద! కనుక మనసు బలంగా,ఆరోగ్యంగా,పరిశుద్ధంగా వుండాలి.
'' మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో: '' అన్నది ఉపనిషత్తు అందుకే! బంధనాలకైనా, మోక్షము
(విముక్తి)కైనా మనసే కారణం అవుతుందని!'' ప్రాణి కోటికెల్ల బంధంబు, మోక్షంబు జేరుటకును మనసు కారణంబు,
విషయసంగి యైన , విను,బంధకారి..నిర్విషయమైన ముక్తి విభవ కారి '' అని ఈ భావాన్నే ఎంత అందంగానో
పలికించాడు శ్రీ కృష్ణ దేవ రాయలు!The Mind in its place can make a Heaven of Hell, a Hell of Heaven..
అన్నాడు , దీన్నే, పాశ్చాత్యుడు, బహుశ Shakespeare అనుకుంటా..కాకుంటే Milton!..అన్నది ఎవరు అనేది
అన్నదాని కంటే అన్నదేమిటనేది ఇంకా ముఖ్యం!విన్నదెంత మంది అనే దానికంటే విని అర్థం చేసుకున్న వాళ్ళు
ఎంతమంది.. అర్థం చేసుకున్న వాళ్ళలో ఆచరించింది ఎంతమంది అనే దానిని బట్టి ఫలితం ఎంత అనేది తేలుతుంది!
ఈ మనసే... నేను, నాది,నాది మాత్రమే, నాది కాకుంటే ఎవరిదీ కావడానికి వీలు లేదు..అని అంచెలంచెలుగా
వికృతమైన భావాల ఆకృతులు దాలుస్తూ, మనిషిని రాక్షసుడిని చేస్తుంది. తనకు దక్కనిదానిని ఎవరూ దక్కించుకోవడానికి
వీలు లేదనే పైశాచిక ప్రవృత్తికి ఇదే కారణం!చివరికి తనకు దక్కకున్నా పరవాలేదు కానీ వేరే వాళ్లకు దక్కటానికి
మాత్రం వీలు లేదు అనుకునే దాక తీసుకెళ్తుంది. కనుకనే '' ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి, న మమేతిచ, మమేతి
బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే '' అన్నది ఉపనిషత్తు! బంధనాలకైనా, విముక్తికైనా రెండంటే రెండే మాటలు కారణం
అన్నది.'నాది', 'నాది కాదు ' ...ఈ రెండే ఆ రెండు!ఈ భావాన్నే '' నరనాధ! పాంచ భౌతిక శరీరమున దేహి మోహ
సాంద్రతమ తమః పరివృతుడై, ఏను, ఇది నా పరికరమని అవధి లేని భ్రమ పడి తిరుగున్! ''.. అని
చెప్పాడు శ్రీ కృష్ణ దేవరాయలు!
నాది అనేది చివరికి నాది మాత్రమే అనే పతనపు అగాధపు అంచులదాకా దాకా తీసుకెళ్తుంది..నాది కాదు అనేది
ఎవరిదైతే ఏం? అనే ఉదార స్వభావపు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి దోహదమౌతుంది!అదే వైరాగ్య భావం! త్యాగ భావం!
దానికి మనసును నిరోధించుకోవడమే మార్గం!మనసును నిరోధించుకోవడానికి మంచి సాహిత్య చర్చ, మంచి సహవాసాలు,
సమాజసేవ,సాటి మానవ సేవ,ఇతర ప్రాణి కోటి సేవ,దైవ భక్తి, ధ్యానం, యోగం..ఎన్ని మార్గాలో!
మార్గం ఏదైనా..ఆ మార్గంలో ప్రయాణించాలనే కోరిక ముఖ్యం, ప్రయాణం చేశే శక్తి కంటే కూడా!శక్తి వుండీ కోరిక లేకుంటే
ఎక్కడికీ వెళ్ళలేడు,శక్తి లేకున్నా కోరిక వుంటే ఎంతోకొంత దూరం, ఎలాగోలా వెళ్ళొచ్చు!
వనం వేంకట వరప్రసాద రావు గారి సహకారంతో...
0 comments:
Post a Comment