సుప్రసిద్ధ తెలుగు కవి పండితుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో చెప్పాలంటే "అన్నమయ్య రచనలు ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే."
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.
ఉదాహరణలు
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥
0 comments:
Post a Comment