Thursday 4 August 2011

ఆధ్యాత్మిక సాధనకు మూలం నమ్మకం

1 comments


ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. ఆయన తండ్రి హిరణ్యకశిపుడు అతన్ని విష్ణువును ప్రార్థించకుండా ఉండటానికి సర్వ విధాలా ప్రయత్నించాడు. కానీ ఆ శ్రీ మహా విష్ణువు పట్ల అతనికున్న తిరుగులేని భక్తి విశ్వాసాల ముందు ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతను చిన్నతనం నుంచే మహాఋషుల ఉపన్యాసాలను శ్రద్ధగా ఆలకించేవాడు. తల్లి గర్భంలో ఉండగా నారదుడు వచ్చి ఆమెకు విష్ణు ప్రవచనాలను వినిపిస్తుండేవాడు. ఆమె ఒక్కోసారి నిద్రపోయినా అవి గర్భంలో ఉన్న ప్రహ్లాదునిపై చెరగని ముద్ర వేశాయి.

ప్రహ్లాదుడు పదకొండు సంవత్సరాల వయసులో ఉండగా, ప్రజల సమస్యల మీద అవగాహన కలగాలని హిరణ్యకశిపుడు అతన్ని ఇతర సైనికులతో పాటు గస్తీ తిరగమని పంపించాడు. ప్రహ్లాదుడు అలా తిరుగుతుండగా ఓ రోజు రాత్రి దూరంగా ఓ వైపు నుంచి పొగ, మంటలు రావడం గమనించాడు. దగ్గరికెళ్ళి చూస్తే ఓ కుమ్మరి తాను తయారు చేసిన కుండలు కాలుతూ ఉన్నాయి. అతను మాత్రం బాధ నిండిన ముఖంతో, ముకుళిత హస్తాలతో ఇలా ప్రార్థిస్తున్నాడు.
“దేవా! ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వనుకుంటే జరగనిది ఏదీ లేదు. హే భగవాన్! దయ ఉంచు. నేను అజాగ్రత్త పరుణ్ణే, కానీ నీవు దయామయుడవు. కరుణా సముద్రుడవు! నీవొక్కనివే నా తప్పును మన్నించగలవు. నేనెంత దుర్మార్గుణ్ణైనా నీ వాడిని. నీ కృపతో ఏదైనా సాధ్యమే. ఆ పిల్లి కూనల్ని నువ్వే కాపాడాలి.”
అలా పదే పదే అనుకుంటూ ఆ కుమ్మరి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. కుండల చుట్టూ మంటలు కమ్ముకుంటున్నాయి. ప్రహ్లాదుడికి ఇదంతా వింతగా, ఆశ్చర్యంగా అనిపించి అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు.
ప్రహ్లాదుడు: “ఏం జరిగింది? నువ్వేం చేస్తున్నావు?”
కుమ్మరి: “ఏం చెప్పమంటావు కుమారా! నేను కుండలు తయారు చేసి వాటిని కాల్చడానికి మంటల్లో వేశాను. వాటిలో ఒక కుండలో ఒక పిల్లి కొన్ని కూనలకు జన్మనిచ్చింది. మంటల్లో పెట్టడానికి ముందు వాటిని తీసేయాలనుకున్నాను కానీ మరిచిపోయాను. వాటిని మంటల్లో పెట్టేసి బాగా అంటుకున్న తర్వాత ఆ విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. అంతా భగవంతుడి దయ. ఆయన తలుచుకుంటే వాటిని కాపాడగలుగుతాడు. అందుకనే ఆయన్ను ప్రార్థిస్తున్నాను.” అన్నాడు
ప్రహ్లాదుడు: “ఇది కేవలం నీ మూర్ఖత్వం, పిచ్చితనం, మంటలు అంత పెద్దవిగా ఉంటే ఆ కూనలు ఎలా బ్రతుకుతాయి?”
కుమ్మరి: “నిజం రాకుమారా! భగవంతుడు తలుచుకుంటే తప్పకుండా బ్రతుకుతాయి. ఆయన తలుచుకుంటే ఓ చిన్న విత్తనం నుంచి మహావృక్షం మొలకెత్తుతుంది. మాతృమూర్తి గర్భంలోని ఓ చిన్న ద్రవ బిందువు నుంచి ఓ చక్రవర్తిని ఉద్భవింపజేయగలడు. ఓ నీటి చుక్క నుంచే నీవు-నేను, మంచి-చెడు అనే అంతరాలు ఉద్భవించాయి. ఇవన్నీ పరమాత్ముని లీలలు కాదా? ఆవు ఎండు గడ్డి తని తీయటి, తెల్లని పాలిస్తుంది. పాము పాలు తాగి విషాన్నిస్తుంది. తల్లి మామూలు ఆహారాన్ని పాలుగా మార్చి బిడ్డకు అందిస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద వారవగానే అలా తయారవడం ఆగిపోతుంది. ఇవన్నీ భగవంతుని యొక్క అంతులేని లీలలే!”
ప్రహ్లాదుడు: “సరే, మంటలు ఆరిపోయిన తర్వాత నన్నొకసారి పిలువు. ఆ కూనలు ఎలా బ్రతికుంటాయో చూడాలని ఉంది.”
కుమ్మరి: “చిత్తం రాకుమారా! మీరు రేపు వేకువ జామునే రండి. రేపే ఆ కుండల్ని తెరిచి చూపిస్తాను”
తర్వాతి రోజు ఉదయమే ప్రహ్లాదుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ కుమ్మరి కాసేపు ధ్యానం చేసుకుని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆ కుండలు తెరిచాడు. వాటిలో నాలుగు కుండలు సరిగా కాలలేదు. పచ్చిగా ఉన్నాయి. వాటిని తాకగానే నాలుగు పిల్లి కూనలు బయటికి దూకి పరిగెత్తాయి.
ప్రహ్లాదుని మనసులో ఎక్కడో దాగి ఉన్న ఆధ్యాత్మిక ఆలోచనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జీవిత సారం భగవంతుడే అని గ్రహించాడు. దైవారాధన ప్రారంభించాడు. అతను విష్ణువును ఆరాధించడం చాలా మందికి నచ్చలేదు. అసుర రాజు పుత్రుడై ఉండి వారి బద్ధ విరోధి విష్ణువును ఆరాధించడమా? అని విమర్శించే వారు. కానీ ప్రహ్లాదుడు ఇవేమీ పట్టించుకోకుండా అచంచల భక్తితో విష్ణువును పూజిస్తూ ఉండేవాడు.అతని తండ్రి మొదట్లో కోప్పడ్డాడు. తర్వాత కొండల మీద నుంచి కిందకి తోయించాడు. సముద్రంలో పడవేయించాడు. ఏనుగులతో తొక్కించాడు. కానీ అవేవీ అతని విశ్వాసాన్ని కదిలించలేకపోయాయి.
భగవంతుని పై నిజమైన విశ్వాసాన్ని సాధించడం చాలా కష్టం. ఒక్కసారి నమ్మకం ఏర్పడ్డ తరువాత దాన్ని చివరి దాకా కొనసాగించడం కూడా కష్టమే. ఆ నమ్మకం అలాగే నిలిచి ఉన్నా ఆత్మ సాక్షాత్కారం పొందడం ఇంకా కష్టం.
ప్రహ్లాదుని చంపించడానికి హిరణ్యకశిపుడు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ అతనికి హాని కలిగించలేకపోయాయి. ప్రహ్లాదుని మనసులో ఆలోచనంతా ఒకటే. “ఆ పిల్లి కూనల్ని రక్షించిన దేవుడు నన్ను రక్షించలేడా? నన్ను ఖచ్చితంగా కాపాడతాడు” అనుకొని పూర్తిగా భగవంతునికి సమర్పించుకున్నాడు. ప్రహ్లాదుని చంపడానికి అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత హిరణ్య కశిపుడు బాగా ఎర్రగా మండుతున్న ఇనుప స్తంభం దగ్గరికి తీసుకెళ్ళి
“భగవంతుడు సర్వాంతర్యామి అంటావు కదా. అయితే ఆయన ఈ స్తంభంలో కూడా ఉంటాడు. వెళ్ళి దానిని కావలించుకో. ఎక్కడైనా ఉంటాడన్న మాట నిజమయితే ఇక్కడ కూడా ప్రత్యక్షమవుతాడు” అన్నాడు.
ప్రహ్లాదుడు మనస్పూర్తిగా భగవంతుని ధ్యానిస్తూ ఆ స్తంభాన్ని కావలించుకున్నాడు. అప్పుడే అక్కడ నరసింహ మూర్తి ప్రత్యక్షమయ్యాడు.హిరణ్యకశిపుని తన వాడి గోళ్ళతో వధించాడు.

భౌతికవాదం బాగా వ్యాప్తి చెందినపుడు, సామాన్యులు కౄరపాలకుల బారిన పడ్డప్పుడు భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తుంటాడు. హిరణ్యకశిపుడ్ని సంహరించిన తరువాత అతన్ని తన ద్వారపాలకునిగా మునుపటి స్థానానికే (వైకుంఠానికే) రప్పించుకున్నాడు. ప్రహ్లాదుని చక్రవర్తిగా చేసి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.
ప్రహ్లాదుడు భగవంతుని ఈ స్వరూపంలోనే చూడగలిగాడు కానీ నిజమైన భగవత్‌స్వరూపాన్ని తెలుసుకోలేదు. దాన్ని తెలుసుకోవడం కష్టం కూడా.
కొంత కాలం తర్వాత దానవుల గురువైన శుక్రాచార్యుడు, ప్రహ్లాదుని మనసులో చిన్న సందేహాన్ని రేకెత్తించాడు.
“ప్రహ్లాదా! ఆ విష్ణువు మీ తండ్రిని సంహరించాడు. నిన్ను రక్షించమని కోరావే కానీ మీ తండ్రిని సంహరించమని కోరలేదు కదా?” అన్నాడు.
“లేదు మా తండ్రిని చంపమని నేను కోరలేదు”
“నువ్వు అడకపోతే ఆయన మీ తండ్రిని ఎందుకు చంపినట్టు? మీ తండ్రి యొక్క కౄర మనస్తత్వాన్ని మార్చి ఉండచ్చు కదా! కానీ ఎందుకు చంపాడు?”
ప్రహ్లాదునికి విష్ణువుపై అపారమైన భక్తి ఉంది. కానీ మన నమ్మకాల్ని బలంగా కదిలించగల వాళ్ళు మనకు ఎదురైనప్పుడు ఆ నమ్మకం అదృశ్యమైపోతుంది. ఓ ఆధ్యాత్మిక సాధకుడికి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తారసపడుతుంటారు. ఎవరో ఒకరు కనిపించి మీరు నేర్చుకున్న గురుమంత్రం గురించో, మీరు పాటిస్తున్న ఆధ్యాత్మిక సాధనా పద్దతుల గురించో, ఎంచుకున్న గురువు గురించో, భగవంతుడి గురించో, ఉపన్యాసాల గురించో అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఒక వేళ అలాంటి వాళ్ళు ఎవరూ ఎదురవకపోయినా ఒక్కోసారి మన మనసులోనే అనుమానాలు రేకెత్తవచ్చు. అందుకే నమ్మకం ఎప్పటికీ అలాగే నిలిచి ఉండదు.
అలా ప్రహ్లాదుని నమ్మకం శుక్రాచార్యులు కదిలించగలిగాడు. ఆయన ప్రహ్లాదునితో అంటున్నాడు. ” విష్ణువు మీ తండ్రిని సంహరించాడు  కానీ నువ్వు అతన్ని ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నావు. ఇది కేవలం నీ గుడ్డి నమ్మకం మాత్రమే!”
భక్తుడు ఎపుడైనా “గుడ్డి నమ్మకం” అనే మాట వినగానే దాన్ని ఆక్షేపించడానికి, అభ్యంతరం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని మనసులో అనుమానం అనే బీజం బలంగా నాటుకుందన్నమాట. అలా విన్న మాటలు ఎప్పుడో ఒకప్పుడు ప్రభావం చూపిస్తాయి.
అందుకనే గురు గీతలో ఒకచోట అంటాడు.

“ఎప్పుడైతే నీ గురువును విమర్శించిన వారి నాలుకను తెగ్గోయలేకపోతావో, నువ్వు అతన్ని నీ దగ్గరి నుంచి తరిమేయాలి. ఒక వేళ నువ్వు అలా చేయలేని పక్షంలో నీవే అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా నిష్క్రమించాలి.”
ప్రహ్లాదుడు శుక్రాచార్యునితో అంటున్నాడు.” మీరు అలా భావిస్తే సరే. నేను ఆ విష్ణువుపైన ఎలాగైనా పగ తీర్చుకుంటాను” అన్నాడు
ప్రహ్లాదుడు యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసి విష్ణువును పిలవడానికి సిద్ధమయ్యాడు.
భగవంతుడెప్పుడూ తన భక్తులు దిగజారిపోవడం చూడలేడు. దయామయుడైన ఆ శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో ప్రహ్లాదుని కలవడానికి వచ్చాడు. అతను ప్రహ్లాదుని రాజప్రాసాద ప్రాంగణంలోకి ప్రవేశించగానే అక్కడున్న ఓ భటుడు,
“ఓయీ బ్రాహ్మణోత్తమా ఎవరు నీవు? ప్రహ్లాదుడిప్పుడు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు నీలాంటి సాధు బ్రాహ్మణులను చూడటం అంత మంచిది కాదు” అన్నాడు.
“ప్రహ్లాదుడు నాలాంటి సాధువులకు మంచి గౌరవాన్నిస్తాడని విన్నానే! నువ్వేమో నన్ను లోపలికే పంపనంటున్నావు?”
అప్పుడా భటుడు “ప్రహ్లాదుడు ఇప్పుడి మునుపటి లాగా కాదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. మా గురువర్యులు శుక్రాచార్యులు ఆయనకి అంతా వివరించారు. ఇప్పుడాయన ఆ విష్ణువుపై పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు సాధ్యమైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళు” అన్నాడు.
“సోదరా! ఏమైనా కానీ నేను మాత్రం ప్రహ్లాదుడిని కలవకుండా వెళ్ళేది లేదు. నువ్వు నన్ను లోపలికి పంపించకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. అప్పుడు నీకు ఓ బ్రాహ్మణుని హత్య చేసిన పాతకం చుట్టుకుంటుంది” అన్నాడు.
అలా విష్ణువు ప్రహ్లాదుని రాజ భవనంలోకి ప్రవేశించి ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు.
” ప్రహ్లాదా! సుభిక్షంగా ఉందువు గాక!, నువ్వు మీ పితృహంతకుడి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరుతున్నట్లున్నావ్!, నేను కూడా ఆయన వల్ల నాశనమైన వాణ్ణే” అంటూ ప్రహ్లాదుని కొన్ని మాయమాటలతో దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు.
ప్రహ్లాదుని బ్రాహ్మణుడిలా అడుగుతున్నాడు ” నీకు విష్ణువు ఎక్కడుంటాడో తెలుసా?”
ప్రహ్లాదుడు: “ఆయన సర్వాంతర్యామి. అందరి హృదయాల్లోనూ ఉంటాడు.”
బ్రాహ్మణుడు: ” ప్రహ్లాదా! అయితే అందరి హృదయాల్లోనూ ఉన్న అతన్ని ఎలా చంపగలవు? చూడబోతే నాకు మల్లేనే నీవు కూడా తెలివి తక్కువ వాడిలా ఉన్నావు. శుక్రాచార్యుని బోధలు విని దుష్ట ప్రతిజ్ఞ పూనినట్టున్నావు. నేను ఓ కట్టెను ఇక్కడ నాటుతాను. దాన్ని నీవు బయటికి లాగగలిగితే నీకు విష్ణువు జయించే శక్తి ఉన్నట్లు లెక్క.”
ప్రహ్లాదుడు పైకి లేచి ఒంటి చేత్తో ఆ కర్రను లాగడానికి ప్రయత్నించాడు. కుదర్లేదు. రెండు చేతులతో బలాన్నంతా ప్రయోగించాడు. వీలు కాలేదు. అలా ప్రయత్నం చేయగా చేయగా అతని ఆత్మ విశ్వాసం సన్నగిల్లింది. అహం నెమ్మదిగా చల్లారింది. ఆ బ్రాహ్మణుడెవరో సామాన్యుడు కాదని నిశ్చయించుకున్నాడు. ప్రహ్లాదుడు వాస్తవంగా నిజమైన భక్తుడే. కానీ పరిస్థితుల ప్రభావానికి లోబడి దారి తప్పాడు అంతే. అతని మనసు మళ్ళీ దారికి వచ్చింది. ఆ బ్రాహ్మణుని పట్ల గౌరవ భావంతో,
“ఓ బ్రాహ్మణోత్తమా! ఎవరు మీరు?”
విష్ణువు: “ఎవరిని వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళు నన్ను పూర్తిగా తెలుసుకోలేరు. ఎవరైతే వాళ్ళ గురించి, నా గురించి ఎరుక కలిగియుండరో వాళ్ళు నీళ్ళపైన తేలియాడే రెమ్మ లాగా ఊగిసలాడుతూ ఉంటారు. చెడు ఆలోచనల బారిన పడి నువ్వు నీ మనశ్శాంతిని పోగొట్టుకున్నావు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా బాధ పడాల్సిందే.”
ప్రహ్లాదుడికి అప్పుడర్థమైంది వచ్చిన వాడు ఆ శ్రీ మన్నారాయణుడే అని. ఆయన పాదాలపై బడి క్షమాపణ కోరాడు. అప్పుడా శ్రీ హరి తన భక్తునిపై వాత్సల్యంతో,
“నేను నిన్ను క్షమించడం కాదు. నువ్వే నన్ను క్షమించు! ఇంతకు మునుపే నాపై యుద్ధం ప్రకటించావు కదా!” అన్నాడు.
ఒకసారేమో ప్రహ్లాదుని భక్తిని సడలించడానికి హిరణ్యకశిపుడు శత విధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరో సారేమో శుక్రాచార్యుడు తియ్యటి మాటలతో ప్రహ్లాదుని మనసుని కలుషితం చేయగలిగాడు.
ప్రహ్లాదుని వంటి మహా భక్తుని నమ్మకమే కదిలిపోయినప్పుడు సాధారణ ఆధ్యాత్మిక సాధకులు ఎంత జాగరూకతతో ఉండాలో ఆలోచించండి!

1 comments:

Anonymous said...

excellent

Post a Comment