శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా
షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా
శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి
ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్
షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా
శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి
ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్
తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని అష్టదిగ్గజాలనే తెలుగు కవుల్లో పెద్దన అగ్రగణ్యుడు. రాయలవారికి ఈయనంటే మహా గౌరవం. ఆ మహాకవి కూర్చున్న పల్లకీని తన చేతులతో స్వయంగా పట్టి ఎత్తించాడట. సత్కార పూర్వకంగా ఇచ్చే గండపెండేరాన్ని తానే స్వయంగా కవి కాలికి తొడిగాడట. అదీ ఆ రాజప్రభువు సంస్కారం. అలాగే, పెద్దనకి రాయల వారంటే ప్రాణం. రాయలు మరణించినప్పుడు ఆయనతో తనూ పోలేక జీవచ్చవంలా బ్రతుకుతున్నానే అని వాపోయాడట.
‘మను చరిత్రము’ పెద్దన రచించిన ఒకే ఒక ప్రబంధ కావ్యం. దీనికే స్వారోచిష మనుసంభవమనే పేరు కూడా ఉంది. మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. తిమ్మన, ధూర్జటి లాంటి ఒకరిద్దరు కవులు సమగ్రమైన కావ్యాలు వ్రాసినా, వారంతా పెద్దన తర్వాత పేర్కొనవలసిన వారే. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు.
పూర్వం, కాశీ దగ్గర ఒక ఊళ్ళో ప్రవరుడనే నైష్టిక బ్రాహ్మణుడు ఉంటుండే వాడు. ఒకరోజు అతని ఇంటికి విచ్చేసిన ఒక సిద్ధుడు ఇచ్చిన పసరు కాళ్ళకు పూసుకొని, దాని ప్రభావంతో తాను చూడాలనుకున్న హిమాలయ పర్వతాలకు పోతాడు. చూడదలచుకున్న ప్రదేశాలన్నీ చూశాక, తిరిగి ఇంటికి పోదలచుకునేటప్పటికి పసరు కరిగిపోయి ఉంటుంది. ఇక చేసేది లేక అక్కడే కొండల్లో తిరుగాడుతున్న ప్రవరుడికి వరూధిని అనే అప్సరస కంపిస్తుంది. వరూధిని అతణ్ణి మోహించినా, ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోతాడు. దిగులుతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకుంటాడు. అలా పుట్టిన స్వరోచి, ఒక దేశానికి రాజు కావడమూ, వేట కెళ్ళినపుడు మనోరమ అనే యువతిని రక్షించి పెళ్ళాడడమూ, వారికి పుట్టిన కొడుకు స్వారోచిష మనువుగా పేరు పొందటమూ - ఇదీ, టూకీగా మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవం కథ.
కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంధం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.
ప్రవరుడు నిరాకరించి వెళ్ళిపోయిన తర్వాత, వరూధిని దిగులు పడుతూ వుండగా సాయంకాల మవుతుంది. ఆ సాయంసమయాన్ని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ, తరువాత చీకటిని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ వున్నాయి. ఒక పద్యంలో - తనను కోరివచ్చిన ‘అనన్య కాంత’ను అహంకారంతో నిరాకరించి వెళ్ళిపోయిన దుష్ట బ్రాహ్మణుడి మీద సూర్యుడికి కూడా కోపమొచ్చిందేమో అన్నట్లు - సూర్య బింబం కాషాయవర్ణం దాల్చిందట (చూశారా, పెద్దన గారికి కూడా వరూధిని మీదే సానుభూతి). నిజానికి, వరూధిని ప్రవరుడిని మోహించి, వాదోపవాదాలు చేసి, ఆఖరున మీద పడబోయిన ఆమెను చూసి, ఏమిరా, ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తించిందీ దేవకన్య! అన్న జుగుప్స కలగదు. పైగా, ఆమె చతురత, వాదనా పటిమ, హొయలూ, పాఠకుణ్ణి మెప్పిస్తాయి కూడానూ. అదీ పెద్దన నిర్వహణ తీరు!
సాయంకాల వర్ణన చేసిన పద్యం అని కదా చెప్పుకున్నాం. సాయంసమయాన్ని వర్ణిస్తూ అనేకమైన పద్యాలు ఉన్నా, ఇంత సహజ సుందరంగా, స్వభావోక్తిగా చేసిన పద్యం -దీనిని మించినది ఇంకొకటి లేదు. గొప్ప భావనా బలంతో, గొప్ప గొప్ప ఉత్ప్రేక్షలు గుప్పించిన పద్యాలున్నాయి గానీ, ఇంత నిసర్గమైన అందం గలిగిన పద్యం మరొకటి లేదు. ఇంతెందుకు? పెద్దనే, ఈ సందర్భంలోనే, చేసిన వర్ణన ఇంకొకటి ఉంది - “రవిబింబ పతన దీర్ణత పయోధీ గర్భ నిర్గత శేష ఫణి ఫణా రత్న రుచియొ…” - అని. సూర్యుడు పడమటి సముద్రంలో గ్రుంకగానే, ఆ దిక్కు ఆకాశపు కావి రంగు, కలగుండు పడగానే సముద్రపు అడుగునుంచి తల పైకెత్తిన ఆదిశేషుడి పడగల మీది మణుల మెరుపు లాగా, ఉందట. భావన చాలా దూరం పోయింది, వాస్తవం నుంచి దూరంగా. మరి, పైన చెప్పుకున్న పద్యం చూడండి.
సాయంకాలం అయ్యేసరికి ఆకాశంలో బారులు బారులుగా ఇంటిముఖం పట్టిన పక్షులూ, పగటి వేడి తగ్గగానే చల్లబడిన సూర్యకాంత శిలలూ, ఎండతో పాటే మాయమైపోయిన ఎండమావులూ, కాషాయ వర్ణం నింపుకున్న సూర్య బింబమూ, కాంతిని కోల్పోయిన దిక్కులూ, కొలనులో ముడుచుకొని పోతున్న తామరలూ - ఎంత సహజ సుందరమైన సంధ్యా సమయ వర్ణనో చూడండి. సాయంకాలాన్ని ఒక అద్భుతమైన చిత్రపటంలా మన కళ్ళ ముందు నిలిపాడు గదా, కవి.
కేవలం వర్ణనే కాదు, పద్యం నిర్వహించిన తీరు మాత్రం! ‘ణ’ ప్రాసను ఎంచుకొని, గొప్ప ధారను సాధించడానికి ‘ణ’కార పునరావృత్తిగా ఉష్ణాంశు, కోష్ణము, మృగతృష్ణ, నిద్రాణము, దరిద్రాణము, లాంటి పదాలను దట్టించి చెవులకు ఇంపైన సంగీత ధోరణి కల్పించాడు. అను నాసికా వర్ణాల పౌనః పుణ్యంతో, హాయిగా సాగే ధారతో, కండ్ల ఎదుట దృశ్యమానమయే నైసర్గిక సౌందర్యంతో, ఒక మరిచిపోలేని పద్యంగా నిలిచిపోయింది, ఈ పద్యం. వస్తు సౌందర్యమూ, వర్ణనా సౌందర్యమూ రెండూ కలిసిపోయి పుట్టిన ఇంకో సౌందర్యం - ఈ పద్యం. అందుకే, ఇది నాకు నచ్చిన పద్యం.
0 comments:
Post a Comment