త్రైలింగస్వామి 1601వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు. వీరి తల్లిదండ్రులు నరసింగరావ్, విద్యావతి. స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు.
ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే రామాయణ, మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు. అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు. తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు. తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి చేరుకొని అక్కడ సుమారు 150 సంవత్సరాలు పైన ఉన్నాడు.
స్వామివారు కేవలం ఆకులూ అలములు, పండ్లు ఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు. స్వామివారు ఎన్నో విషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. వేలాది ప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు. ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు. ఒక్కొక్కసారి నీటిలోపల, అలల క్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు. వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికా ఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం, స్వామికి ఏమీ కాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.
స్వామి అద్వైత ఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన విషపూరిత ద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామి అబద్దాలకోరు అని ఋజువు చేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు. సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు. త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు. స్వామివారిని కరుణించమన్నాడు. అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా! సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను. ఇంకెప్పుడు ఇలా చేయవద్దు. వెళ్ళీపో" అన్నాడు. ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.
స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు. అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది. అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు. కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పుల పైన పచార్లు చేస్తూ కనిపించేవారు. ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు. అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా. అలా ఐతే నీ మలం నీవే తినగలవా?" అని ప్రశ్నించాడు. స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు. ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది. ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు. ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.
స్వామివారు పుష్య శుద్ధ ఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు. వీరి సమాధి కాశి లో పంచగంగ ఘాట్ లో ఉంది.
0 comments:
Post a Comment