Thursday, 1 January 2015

మానవ సంబంధాలు

0 comments

దేశమంటే మట్టి మాత్రమే కాదు, దేశమంటే మనుషులు అన్నట్లు వ్యక్తి ఎన్నడూ ఒంటరి కాదు. వ్యక్తి అంటే వ్యవస్థ. కుటుంబం అనే పునాది వేసుకొని, బంధాలు, అనురాగాలు స్నేహాలు, మరువలేని పరిచయాలు, నైతిక విలువలు... ఇటుకలుగా చేసుకొని ప్రపంచమనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మహా మనిషి మనిషి.
వ్యతిషజతి పదార్థానంతరః కోపి హేతుః
నఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయంతే!
వికసతి హి పతంగ స్యోదయే పుండరీకం
ద్రవతి చ హిమరశ్మావుద్గతే చంద్రకాంతః॥

మానవ విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీరాముని మానసిక దృక్పథానికి అద్దంపట్టే సందర్భాన్ని నిశితంగా పరిశీలిస్తే - సూర్యోదయం కాగానే కమలం వికసిస్తుంది. చంద్రుని వెన్నెల రాగానే చంద్రకాంతశిల ద్రవిస్తుంది. అనంత వినీలాకాశంలో ఉండే సూర్యచంద్రులకూ, అల్లంతదూరంలో భువిపై, నీటిలో ఉండే వాటికి గల ఆకర్షణశక్తి ఎంతబలీయమైనది, దృఢమైనది. అలాగే లవుడు, శ్రీరామునికి ఎదురుపడినపుడు నిమిత్తమెరుగని స్నేహం, ప్రేమ, వాత్సల్యం హృదయసీమను అలంకరించాయట. బాంధవ్యంలోని గొప్పతనమేమిటంటే అంతః కరణాదులను వ్యక్తీకరించలేని కారణం దగ్గరకు లేస్తుంది. బుద్ధికతీతమై కారణం ఆకర్షణకు గురిచేస్తుంది. కట్టుదిట్టాలను ఎరుగని బంధం ఎంతటి అగాధాన్నైనా మరిపిస్తుంది.
లోకంలో వెలకట్టలేనివి అనుబంధాలు. జీవితం వాటిని బలోపేతం చేసేందుకే పరిస్థితులను కల్పిస్తుందేమో! ఒక్క మానసికంగా జరిగే సంఘర్షణ తాలూకు సూచనను ఆలకిస్తే దూరమైపోయే అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. జన్మజన్మల సారూప్యతను ప్రతీకలైన బంధాలను సుహృదయంతో ఈ జన్మకైనా దృఢతరం చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
సహృదయులైన మనుషులు ఎలాంటివారో వారు నిలబెట్టుకున్న కుటుంబాన్నీ, సత్సంబంధాలనూ, నైతిక విలువలను బట్టి నిర్ధారించవచ్చు. ఒంటిరిగా పుట్టి ఒంటరిగానే వెళ్లిపోయే జీవన చక్రంలో మనకంటూ నలుగురు తోడున్నారనే భావన బంధాల మాధుర్యాలను అనుభవించాననే సంతృప్తి వ్యక్తిని చిరస్థాయిగా మానవ హృదయాలలో ఉండేలా చేస్తుంది. ఆ వ్యక్తి ఆదర్శాన్ని చరిత్ర గౌరవిస్తుంది.
- ఇట్టేడు అర్కనందనాదేవి --

0 comments:

Post a Comment