Wednesday, 22 June 2011

నీతి శ్లోక, పద్యములు

1 comments

మంగళాచరణమ్‌

దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే ।
స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజసే ॥ 1


తాత్పర్యము: త్రిలోకములూ, త్రికాలములూ, దశదిశలూ, అంతటా, అన్నిటా తానే అయి ఆత్మజ్ఞానుభవము చేత మాత్రమే గుర్తించదగిన జ్యోతిస్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము.


మూర్ఖపద్ధతి

బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః ।
అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్‌ ॥
అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః ।
జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥


తాత్పర్యము: బోధించే స్థానములో గురువులు మదమత్సర అసూయా పూరితులై వున్నారు. పాలించే ప్రభువులు గర్వాంధులైనారు. సామాన్యజనులు విని గ్రహించగలిగినంతటి తెలివిగలవారు కారు. కావున నా యీ సుభాషితము నాలోనే జీర్ణించుకుపోయి ఉన్నది. అనగా తన మనస్సు నందు అంతర్లీనముగా యింతకాలం వుండి పోయినదని అర్థము.


ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్‌
సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్‌ ।
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్‌
న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్‌ ॥


తాత్పర్యము: మొసలి నోటికోరల మధ్య నున్న మాణిక్యమును ప్రజ్ఞతో బయటికి తీయవచ్చును. పెద్దపెద్ద అలలతో ఎగసిపడుతున్న సముద్రమును దాటవచ్చును. ఆగ్రహముతో బుసలు కొడుతున్న సర్పమును పూలదండలా శిరస్సున ధరించవచ్చును. కానీ దురాగ్రహపూరితుడైన మూఢుని సమాధాన పర్చుట అసాధ్యము.


లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్‌
పిబేచ్చ మృగ తృష్ణికాసు సలిలం పిపాసార్దితః ।
కదాచిదపి పర్యటన్‌ శశ విషాణమాసాదయేత్‌
న తు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్‌ ॥


తాత్పర్యము: ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావులలో సైతం నీరు సంపాదించి దాహం తీర్చుకోవచ్చును. తిరిగి తిరిగి ఎలాగైనా కుందేలు కొమ్ము సంపాదించవచ్చును. (కుందేలుకు చెవులే కానీ కొమ్ములుండవు) కానీ ఎన్ని విధాల ప్రయత్నించినా మూర్ఖుని మనస్సును రంజింపచేయలేము.


వ్యాళం బాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమ ప్రాంతేన సన్నహ్యతి ।
మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధే రీహతే
మూర్ఖాన్యః ప్రతినేతు మిచ్ఛతి బలాత్సూక్తైః సుధా స్యందిభిః ॥


తాత్పర్యము: తామర తూటి దారములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెనపువ్వు కొనతో వజ్రమును సానపట్టాలని ప్రయత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకునే వాడితోనూ మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ఆశించినవారు సమానులవుతారు.


స్వాయత్త మేకాంతహితం విధాత్రా
వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః ।
విశేషతః సర్వ విదాం సమాజే
విభూషణం మౌనమపండితానామ్‌ ॥


తాత్పర్యము: మూఢులు తమ మూఢత్వాన్ని దాచుకోవడానికై బ్రహ్మ మౌనమును సృష్టించి వారి స్వాధీనం చేశాడు. కావున పండితుల సమక్షమున మౌనమే మూర్ఖులకి అలంకారము. అనగా మూర్ఖులు తెలియని విషయాలను చర్చించరాదు.


యదా కించిద్‌జ్ఞో-హం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞో-స్మీత్యభవ దవలిప్తం మమ మనః ।
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖో-స్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥


తాత్పర్యము: నాకేమి తెలియని కాలములో అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను. తదుపరి ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించాను.


కృమి కుల చిత్తం లాలా క్లిన్నం విగంధి జుగుప్సితం
నిరుపమ రసం ప్రీత్యా ఖాదన్ఖరాస్థి నిరామిషమ్‌ ।
సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య న శంకతే
న హి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహ ఫల్గుతామ్‌ ॥


తాత్పర్యము: గాడిద యెముకలో మాంసము లేకపోయినా, దానిలో పురుగులు చేరినా, డొల్లుతో తడిసి కంపు కొడుతూ రోతపుట్టిస్తున్నా కూడా దానిని ప్రీతితో కొరుకుతూ వున్న కుక్క తన ముందు దేవేంద్రుడు ప్రత్యక్ష్యమైనా సిగ్గుపడదు. ఏలననగా, తాను స్వీకరించిన పదార్ధం తుచ్ఛమా, కాదా అను విషయాన్ని నీచప్రాణి పట్టించుకోదు!


శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం
మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిమ్‌ ।
అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా
వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥
తాత్పర్యము: గంగానదీమ తల్లి మొదట అంతరిక్షము నుండి ఏశ్వరుని శిరస్సు మీదకూ, అక్కడి నుండి హిమాలయముల మీదకూ, అచటినుండి భూమికీ, ఆపైన భూమి నుండి సముద్రములోనికి చేరి పాతాళమునకు చేరుకున్నది. అగ్రపీఠము నుండి స్థానభ్రంశము చెందిన వారికి యీ విధమైన అధఃపాతాళము సంభవిస్తుంది.


శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో
నాగేంద్రో నిశితాంకుశేన సమదో దండేన గౌర్గర్దభః ।
వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మంత్ర ప్రయోగైర్విషం
సర్వస్యౌషధమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్య్తౌషధమ్‌ ॥


తాత్పర్యము: నిప్పును నివారించడానికి నీటిని, సూర్యతాప నివారణకు గొడుగునూ, మత్తగజమునకు అంకుశాన్ని, గాడిద, ఎద్దు తదితర జంతువుల కోసం కర్రనూ, రోగమునకు వివివ్ధ ఔషధములనూ, విషమునకు నివారణగా వివిధ మంత్రాలనూ శాస్త్రములందు వుదహరించబడ్డాయి. కానీ మూర్ఖత్వమును నివారించు మందు ఏదీ శాస్త్రములలో తెలుపలేదు. అనగా మూర్ఖత్వమునకు విరుగుడు లేదని భావం.
"గీత మంజరి" లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ





1 comments:

Unknown said...

పద్యాల గురించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te

Post a Comment