Thursday 5 May 2016

శివాపరాధాక్షమా స్తోత్రము తెలుగు

7 comments
తెలుగు అనువాదము : శ్రీ దువ్వూరి v n సుబ్బారావుగారు 


శ్రీ శంకర భగవత్పాదులకు పాదాభివందనములతో............. తొల్లి కర్మల వశమున తల్లి గర్భ వాస నరకమ్ము నొందితి పాప మంట మూత్ర మలముల మధ్యన మునిగి యుంటి కాల్చె జఠరాగ్ని తనువును గాఢముగను. అప్పు డెంతటి దుఃఖమో చెప్ప తరమె ? నీకు తెలియదా నాబాధ నిజముగాను ? నిన్ను స్మరియింప లేదని నింద మోపి తప్పు లెన్నగ శంకరా తగదు నీకు. బాల్యమున పొర్లితిని మల పంకిలమున దప్పిగొని స్తన్య పానాన తగిలియుంటి ఇంద్రియమ్ముల శక్తి లేదింత యైన భవ జనితమైన జీవముల్ బాధ పెట్టె. పెక్కు వ్యాధుల బాధలు పీడ జేసె దుఃఖ పరవశ మొందితిన్, తోప లేదు నీదు నామమ్ము, నేరమే నీలకంఠ! తప్పు క్షమియించు శంకరా! దయను జూపు. యవ్వనమ్మున నన్ను విషాహు లైదు మర్మ సంధుల గఱచుట మాసి పోయె తెలివి ! పుత్రుల, సిరులను, స్త్రీల బొంది తగని సంసార సుఖముల తగిలి యుంటి. అంతమే లేని మాన గర్వాంధత బడి యెదను నీ చింత తోపలే దింత యైన నేర మొనరించితిని శివా! నేర నైతి తప్పు మన్నించు శంకరా! దయను జూడు. వార్ధకమ్మున నింద్రియాల్ వడలి పోయె బుద్ధి వికలమై మనమున పొగులుచుంటి వ్యాధి బాధల దైవిక పాశములను పాప రోగాల విరహాల వ్యసనములను తనువు కృశియించె ఙ్ఞప్తియు తగ్గిపోయె దీనతను బొంది యే దిక్కు గానకుంటి శివశివా! నీదు స్మరణమ్ము చేయకుంటి తప్పు గావవె శంకరా! దయను జూపు. వేకువను లేచి నీ యభిషేకమునకు స్నానమొనరించి తేనైతి చల్లనైన గంగ నీటిని, పూజకై కఱవు దీర బిల్వ దళములు తేనైతి, కల్వ పూల, పరిమళమ్ముల వెదజల్లు సరసిజముల, గంధ ధూపాల తేనైతి బంధురముగ శివ శివా! నన్ను మన్నించు చేసినాడ తప్పు! క్షమియించు శంకరా! దయను జూడు. పెరుగు తేనెను నెయ్యయు బెల్లములను పాల నభిషేక మొనరింప జాలనైతి చందనము పూయలేనైతి చల్లగాను స్వర్ణ పుష్పాలు ధూపదీపాలు లేవు. వివిధ భక్ష్యమ్ములను దెచ్చి విరివిగాను నీకు నైవేద్య మిడకుంటి నీలకంఠ ! నన్ను క్షమియించు శంకరా! నతులు నీకు తప్పు మన్నించు కాపాడు దండము లివె. పదపదమ్మున గహనమై భారమైన స్మార్త కర్మలు చేయగా శక్తి లేదు బ్రహ్మ మార్గానుసారియౌ బ్రాహ్మణునకు విహితమౌ శ్రౌత మనినచో వెఱపు నాకు. తత్త్వ మెరిగిన పిమ్మట తలుపనేల శ్రవణ మననాల ధ్యానమ్ము నెవడు జేయు నేరమున్ జేసినాడను నిన్ను మరచి తప్పు మన్నించు శంకరా! దయను జూడు. మదిని నీ నామమును దల్చి మరల మరల ద్విజుల కెక్కుడు దక్షిణల్ బెట్ట లేదు బీజ మంత్రాలతో నీదు పేరు జెప్పి లక్ష హోమాల జేయ లేదక్షయముగ. గంగ యొడ్డున నీ వ్రత కర్మ సలిపి దాన మిడి రుద్ర జపమును దలుపనైతి తప్పు మన్నించు శంకరా! దయను జూడు నాదు యపరాధమును సైచి నన్ను గావు. స్వామి నగ్నుడ వీవు! నిస్సంగుడవును! త్రిగుణ రహితుడ వీవు! నీ దృష్టి యెపుడు నిల్చు నాసాగ్ర మందున! నీవు మోహ- తమ మెరుంగవు! భవమందు తపన లేదు! మంద బుద్ధినై యున్మత్త మతిని యగుచు నిన్ను స్మరియింప కుంటిని నిత్య మకట నన్ను మన్నించు శంకరా! నాదు తప్పు గాచి రక్షించు దయతోడ కాల కాల! హృదయ సరసిజ స్థానాన నెపుడు నిలచి ప్రణవ యుత ప్రాణయామాన వాయు గతిని సూక్ష్మ మార్గాన స్తంభింప జూచి శాంతు, దాంతు, దివ్య శివాఖ్యుని దలుప నైతి. సకల మందుండు లింగరూపకుని, బ్రహ్మ- వాక్యమున నేను స్మరియించి పలుకనైతి నాగ్రహింపకు శంకరా! అధముడనని తప్పు మన్నించు శివశివా! దయను జూపు. హృద్యుడును వేద వేదాంత వేద్యు డీవు ! హృదయ పద్మాల వెల్గుల నీను జ్యోతి, శాంత చిత్తుండు, నిత్యుడున్, సత్య మూర్తి, వివిధ మునిజన హృదయాబ్జ వేద్యుడీవు ! స్వప్న జాగ్ర త్సుషుప్త్య వస్థలకు పరుడు, త్రిగుణములకు నతీతునిన్ దెలియ కుంటి దురితమును జేసి యుంటిని దుష్ట మతిని నన్ను క్షమియించు శంకరా! నన్ను గావు. ఇందుధరున్! స్మరాంతకుని! యీశుని! శీర్షమునన్ సురాపగల్ చిందులు వేయు వాని! సువిశేష శుభంకరు! నాగభూషణున్! సుందరు! నగ్ని లోచనుని! శుద్ధు! కపర్దిని! చిన్మయున్! మనో- మందిర మందు నిల్పు మిక! మంత్ర మఖమ్ముల నేమి ముక్తియౌ? ఏమిడు యాత్రలున్ ధనము నేన్గులు గుఱ్ఱము లేలు రాజ్యమున్ ? ఏమిడు పుత్ర మిత్ర సతులిల్లును గోవులు కీర్తి సంపదల్? ఏమిడు దేహ? మెన్న నివి యెల్లను బుద్బుదముల్! తలొగ్గకన్ కామునకున్ గురూక్తుల ప్రకారము సాంబశివున్ భజింపుమా! పౌరోహితీ వృత్తి, బ్రహ్మ విద్వేషమ్ము ..............పరమేశ్వరా! నాకు వలదు వలదు. రాత్రి సంచారమ్ము, గ్రామాధికారమ్ము ..............పార్వతీపతి! నాకు వలదు వలదు. మూగ సంతతియు, నియోగమున్, పరభుక్తి ..............భవహర! శివ! నాకు వలదు వలదు. కల్లలాడు ప్రవృత్తి, ఖలజన మైత్రియు ..............వామదేవా! నాకు వలదు వలదు. భూత నిర్దయ, పశుబుద్ది భూతనాధ! సాక్షి వాదమ్ము లిచ్చుటల్ సాంబ మూర్తి! వలదు వలదోయి నాకిల వలదు వలదు జన్మ జన్మల కైనను శంకర! శివ! ఆయుష్షు జారెడు ననుదినమ్మును జూడ ...............కవ్వించి మాయమౌ యవ్వనమ్ము! పోయిన దినములు పోవు మరలి రావు ...............కబళించు లోకమున్ కాల మెపుడు! భంగ తరంగముల్ క్రుంగెడు రీతిని ................చంచలమౌ సిరి సంపదలును! మెరుపు తీగె యనంగ మురిపించి మాయమౌ ................నీవిడి నట్టి నా జీవితమ్ము! శరణమని పట్టితిని నీదు చరణములను గాన శంకరా! నాయందు కరుణ జూపి నాకు చేయూత నిమ్ము పినాక పాణి! విడచి పెట్టక యేలుకో! విశ్వనాథ!

7 comments:

మిస్సన్న said...

ధన్యవాదాలు హరికృష్ణ గారూ.

sreekanth sharma said...

చాలా బాగుంది హరి

sreekanth sharma said...

చాలా బాగుంది హరి

mahadeva vedhapatashala said...

ధన్యవాదాలు మంచి విషయాలు పోస్ట్ చేసినందుకు

mahadeva vedhapatashala said...

ధన్యవాదాలు మంచి విషయాలు పోస్ట్ చేసినందుకు

Harikrishna nukala said...

ధన్యవాదములు

priya k said...

You always provide quality based posts, enjoy reading your work. Read West facing house vastu tips by our vastu specialist.

Post a Comment